- ముమ్మరంగా ఉపాధి హామీ పనులు
- రోజురోజుకూ పెరుగుతున్న కూలీల సంఖ్య
- మాస్క్‌లు, భౌతిక దూరంతో పనులు చేయిస్తున్న అధికారులు
కరోనా దెబ్బకు కకావికలమైన పేదలకు ఉపాధిహామీ పనులు ఊరట కలిగించాయి. లాక్‌డౌన్ ప్రారంభంలో భయంతో కూలీలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఇది గమనించిన వైఎస్ జగన్ ప్రభుత్వం వారికి ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. కూలీలకు మాస్క్‌లు ఇవ్వడంతోపాటు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుని అధికారులు పనులు చేయిస్తున్నారు. ఫారంపాండ్లు, చెక్‌డ్యాములు, ఇంకుడు గుంతలు లాంటివి చేపట్టారు. రోజురోజుకు కూలీల సంఖ్య పెరుగుతోంది. 50 మండలాల పరిధిలో వారంలో లక్ష మందికి పైగా పనులు కల్పించాలన్నది లక్ష్యం. జిల్లాలో 4,94,526 మంది రిజిస్టర్ ఉపాధి కూలీలు ఉండగా, దాదాపు అందరికీ పనులు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. మరోవైపు ఉపాధి కూలీలకు రోజువారీ కూలి రేట్లను ప్రభుత్వం పెంచింది. గతంలో ఒక్కొక్కరికి రోజుకు రూ. 211 ఇస్తుండగా, దీనిని రూ. 237కు పెంచారు.
కూలీలందరికీ పనులు
లాక్‌డౌన్ సమయంలో పేదలు ఇబ్బంది పడకూడదని ఉద్దేశంతో ఉపాధి పనులు కల్పిస్తున్నాం. ఈనెల 18వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా 55,102 మందికి పనులు కల్పించాం. ఈ సంఖ్య రోజురోజుకు పెంచుతున్నాం. కరోనా కాలంలో భౌతిక దూరం పాటిస్తూ పనులు చేసేలా పర్యవేక్షిస్తున్నాం. – యదుభూషణ్‌రెడ్డి, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్, కడపప్రభుత్వం ఆదుకుంటోంది
కరోనా లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వం ఆదుకుంటోంది. ఉపాధి పనులు లేకుండా ఉంటే జీవనం భారమయ్యేది. ప్రభుత్వం పనులకు అనుమతులు ఇవ్వడంతో బువ్వ తింటున్నాం. లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఊహించలేక పోతున్నాం. – డి.రెడ్డెమ్మ, ఉపాధిహామీ కూలీ, వేముల
ప్రభుత్వ నిర్ణయంపై కూలీల హర్షం
ఉపాధి.. ఊరట